Hyderabad: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం సాంకేతిక సమస్య కారణంగా టేక్ ఆఫ్ కాకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లాల్సిన విమానంపై స్పందించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమానంలో సినీ సెలబ్రిటీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా ఈ ప్రయాణంలో ఉండాల్సి ఉంది.
రూ. 30,000 చెల్లించి టికెట్ కొనుగోలు చేసినప్పటికీ, విమానం ఎప్పటి వరకు బయలుదేరుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే ముందుగానే సమాచారం ఇవ్వాలి, కానీ గంటల తరబడి నిరీక్షింపజేయడం అన్యాయమని వారు విమానయాన సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక విజయ్ దేవరకొండ తన కుటుంబంతో కలిసి కుంభమేళాకు హాజరయ్యేందుకు ఈ ఉదయం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే విమానం టేక్ ఆఫ్ కాకపోవడంతో అతడితో పాటు మిగతా ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
