Hyderabad: ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని పాలేరు మరియు వైరా రిజర్వాయర్లు నిండిపోయాయి. ప్రస్తుతం గేట్ల ద్వారా వరదనీటిని వదులుతున్నారు.
మహబూబాబాద్, సూర్యపేట జిల్లాల్లో కురిసిన వర్షాల కారణంగా పాలేరు నియోజకవర్గంలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. కొన్ని చోట్ల రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
పాలేరు జలాశయం 23 అడుగుల పూర్తి స్థాయికి చేరుకోవడంతో గేట్లు తెరచి అలుగులు వదులుతున్నారు. అదే విధంగా వైరా రిజర్వాయర్ కూడా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో 18 అడుగుల పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంది. ప్రస్తుతం అలుగుల ద్వారా వరదనీరు ప్రవహిస్తోంది.
కిన్నెరసాని ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున నీరు చేరింది. సాగునీటి కోసం సమృద్ధిగా నీరు అందుబాటులో రావడంతో రైతుల్లో సంతోషం నెలకొంది.