Maganti Gopinath: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఆదివారం అర్థరాత్రి దాటాక ఒక భీకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎస్పీఏ (TSPA) జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి వైపు వస్తున్న సమయంలో వీరి కారు ముందు వెళ్తున్న డీసీఎం (DCM) వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది.
అతివేగమే ప్రమాదానికి కారణమా?
పోలీసుల కథనం ప్రకారం.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు ఆదివారం అర్థరాత్రి సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి గచ్చిబౌలి వైపు తమ కారులో ప్రయాణిస్తున్నారు. టీఎస్పీఏ సమీపానికి చేరుకోగానే, అతివేగంగా ఉన్న వీరి కారు నియంత్రణ తప్పి ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.
ప్రమాదం జరిగిన సమయంలో కారు భారీ వేగంతో ఉండటం వల్లే ఇంతటి నష్టం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నప్పటికీ, కారు వేగం ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
పెద్ద కుమార్తె పరిస్థితి విషమం
ఈ ప్రమాదంలో మాగంటి గోపీనాథ్ పెద్ద కుమార్తెకు శరీరమంతటా తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా తలకు బలమైన దెబ్బ తగలడంతో ఆమె స్పృహ కోల్పోయారు. ప్రస్తుతం ఆమెను గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించి ఐసీయూలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. కాగా, కారులో ఉన్న రెండో కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి, ఆమె ప్రాణాపాయం నుండి సురక్షితంగా బయటపడ్డారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను ఓఆర్ఆర్పై నుండి క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. “హై స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించాం. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం” అని నార్సింగి పోలీసులు తెలిపారు.
