Crime News: సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఓ యువతికి భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఒంటరిగా ప్రయాణిస్తున్న 23 ఏళ్ల యువతిపై ఓ యువకుడు లైంగిక దాడి యత్నానికి పాల్పడ్డాడు. అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బాధితురాలు కదులుతున్న రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది.
ఘటన వివరాలు:
అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. సెల్‌ఫోన్ మరమ్మతు నిమిత్తం సికింద్రాబాద్ వెళ్లిన ఆమె, పనులు ముగించుకొని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి మేడ్చల్‌కు బయలుదేరింది. మహిళల కోసం ప్రత్యేకంగా ఉంచిన కోచ్‌లో ఆమె ప్రయాణిస్తుండగా, ఆ బోగీలో ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్ స్టేషన్ వద్ద దిగిపోయారు.
ఈ సమయంలో 25 ఏళ్ల యువకుడు బోగీలోకి ప్రవేశించి, ఒంటరిగా ఉన్న యువతిపై లైంగికదాడి యత్నం చేశాడు. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన బాధితురాలు, అతని నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రతిఘటించింది. చివరికి రైలు నుంచి కిందకు దూకింది.
ఆసుపత్రిలో చికిత్స:
కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడిన బాధితురాలు తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.
ఇది కూడా చదవండి: Prashant kishore: నితీష్ కుమార్ ఆరోగ్యం బాలేదు.. రాజీనామా చేయాలి..
పోలీసుల చర్యలు:
సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నగరంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు
నిర్భయ వంటి కఠిన చట్టాలున్నా, మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘటన మరోసారి మహిళా భద్రతపై పెద్ద ప్రశ్నను లేపింది. ప్రయాణాల్లో మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
