Hyderabad Metro:హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక మెట్రో రైల్ వ్యవస్థ భవితవ్యంపై తాజాగా అయోమయం నెలకొన్నది. గత 15 నెలలుగా ఆ అయోమయం కొనసాగుతున్నది. తాజాగా మెట్రో నిర్వహణ ఇక తమ వల్ల కావడం లేదని నిర్వహణ సంస్థ ఎల్అండ్‌టీ సంస్థ తేల్చి చెప్పింది. ఈ మేరకు కేంద్రానికి ఏకంగా లేఖ రాసింది. ఇది ఇటు రాష్ట్రానికి, ముఖ్యంగా నగరవాసులకు ఆందోళన కలిగించే అంశమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Hyderabad Metro:ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు ఎల్అండ్‌టీ సంస్థ లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రోకు నష్టాలు వస్తున్నాయని, ఇక తాము హైదరాబాద్ మెట్రోను నడపలేమని ఆ సంస్థ చేతులెత్తేసింది. దీంతో మెట్రో నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు కేంద్రానికి తేల్చి చెప్పింది.
Hyderabad Metro:హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థకు వస్తున్న వరుస నష్టాల వల్ల దీని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని తాము నిర్ణయించినట్టు ఎల్ండ్‌టీ సంస్థ తెలిపింది. పెండింగ్ బకాయిలు, తక్కువగా వచ్చే టికెట్ ఆదాయం, వరుస నష్టాల నేపథ్యంలో మెట్రోను నడపడం కష్టంగా ఉన్నదని కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి జైదీప్‌కు ఎల్అండ్‌టీ అధికారులు లేఖలో పేర్కొన్నారు.
Hyderabad Metro:ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఉచిత ప్రయాణం కోసం తెచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల మెట్రోకు నష్టాలొస్తున్నాయని గతంలో మెట్రో నిర్వహణ సంస్థ పేర్కొన్నది. దీనిపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు వల్లే నష్టాలొస్తున్నాయన్నందుకు హైదరాబాద్ మెట్రో సీఎఫ్‌వోను అరెస్టు చేయాలని చెప్పినట్టు సీఎం ఓ సభలో చెప్పడం గమనార్హం.
Hyderabad Metro:ఇలాంటి పరిస్థితిలో హైదరాబాద్ మెట్రో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నష్టాలొస్తున్నాయని హైదరాబాద్ మెట్రో అంటుండగా, దాని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అని అనుమానం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో వేలాది మందికి సాఫీ ప్రయాణం అందిస్తున్న మెట్రో ఏమైనా కారణాల వల్ల నిలిచిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణ విషయం తేలే వరకూ కొంతకాలమైన నిలిచిపోతుందేమోనని ప్రయాణికుల్లో ఆందోళన నెలకొన్నది. మరి కేంద్రం తీసుకునే నిర్ణయంపైనే హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఆధారపడి ఉన్నదని తెలుస్తున్నది.