GST Scam

GST Scam: జీఎస్టీ ఎగవేత కేసులో కాంగ్రెస్​ నేత సునీల్​ రెడ్డి అరెస్ట్!

GST Scam: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) హైదరాబాద్ అధికారులు పన్ను ఎగవేతదారుల నెట్‌వర్క్‌పై మెరుపు దాడులు నిర్వహించి ఇద్దరు ప్రముఖ వ్యాపారవేత్తలను కటకటాల్లోకి నెట్టారు. నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం, ఆధునిక డేటా అనలిటిక్స్ సాయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో సుమారు 50 కోట్ల రూపాయలకు పైగా జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరెంజ్ ప్యాసింజర్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సునీల్ కుమార్‌తో పాటు, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ చేతన్ ఎన్‌లను అధికారులు అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర స్థాయిలో వ్యవస్థీకృత పద్ధతిలో ఈ పన్ను ఎగవేత సాగుతున్నట్లు దర్యాప్తులో తేలింది.

అరెస్టయిన వారిలో సునీల్ కుమార్ అధికార కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా, ఒక నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ఆయన తన రవాణా సంస్థ ద్వారా ప్రయాణికుల నుంచి సుమారు 28.24 కోట్ల రూపాయల జీఎస్టీని వసూలు చేసినప్పటికీ, ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ఎండీ చేతన్ ఎన్ సుమారు 22 కోట్ల రూపాయల విలువైన నకిలీ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) సృష్టించి ప్రభుత్వానికి భారీగా కన్నం వేశారని ఆధారాలతో సహా నిరూపితమైంది.

Also Read: Donald Trump: 2026 మధ్యంతర ఎన్నికలో ఓడిపోతే.. ట్రంప్ పదవి పోయినాటే

పన్ను ఎగవేత నేరాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న అధికారులు, సీజీఎస్టీ (CGST) చట్టం – 2017 లోని కఠిన నిబంధనల ప్రకారం వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వినియోగదారుల నుంచి పన్ను రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వానికి చెల్లించకుండా సొంతానికి వాడుకోవడం, నకిలీ బిల్లుల ద్వారా లబ్ధి పొందడం వంటి చర్యలను అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో ఈ నెట్‌వర్క్‌కు సంబంధించి మరిన్ని వివరాలను సేకరిస్తోంది. ఈ అరెస్టులు వ్యాపార వర్గాల్లో, ముఖ్యంగా రవాణా, పారిశ్రామిక రంగాల్లో పెద్ద కలకలం రేపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *