Hyderabad: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 49ను తాత్కాలికంగా నిలిపివేసింది. కొమురంభీం జిల్లా పరిధిలో కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటు కోసం ఇటీవల ఈ జీవోను విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయంతో స్థానిక ఆదివాసీలలో తీవ్ర అసంతృప్తి, ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఆదివాసీల భావోద్వేగాలను గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకుని జీవో అమలును నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, వారి ఆందోళనలకు పరిష్కారం లభించే వరకు జీవో అమలును నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
కన్జర్వేషన్ కారిడార్ ఏర్పాటుతో తమ జీవనోపాధి, భూములపై ప్రభావం పడుతుందన్న అభిప్రాయంతో ఆదివాసీ సంఘాలు ఇటీవల పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఈ అంశంపై మరింత చర్చలు జరిపి, ప్రజల సందేహాలను నివృత్తి చేసిన తరువాత తగిన నిర్ణయం తీసుకోనుంది.
