Film Nagar:

Film Nagar: నేటి బాలలే రేపటి గుండాలా? ఫిలింనగర్ రోడ్లపై స్టూడెంట్స్ గ్యాంగ్ వార్

Film Nagar: నేటి బాలలే రేపటి పౌరులు” అనేది ఒకప్పటి మాట.. నేటి బాలలే రేపటి గుండాలు, రౌడీలు అన్నది ప్రస్తుత పరిస్థితి. హైదరాబాద్‌లోని ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వినాయక్ నగర్‌లో నిన్న (బుధవారం) తీవ్రమైన గ్యాంగ్ వార్ జరిగింది. చిన్న వివాదం పెద్దదిగా మారడంతో విద్యార్థులు రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే..

స్కూల్ పిల్లల మధ్య తలెత్తిన చిన్న వివాదంలో మాట మాట పెరిగి పెద్ద గొడవగా మారింది. విద్యార్థులంతా రెండు గ్యాంగ్‌లుగా విడిపోయి ఒకరిపై ఒకరు కర్రలతో, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో వారు వాడిన పదజాలం విన్న స్థానికులు సైతం అవాక్కయ్యారు.

గొడవ ఆపడానికి ప్రయత్నించేందుకు కూడా స్థానికులు భయపడేలా ఆ యువకులు వీరంగం సృష్టించారు. గొడవ మధ్యలో ఎక్కడ తమపై దాడి జరుగుతుందో అని జనం అక్కడి నుండి భయంతో వెళ్లిపోయారు. గొడవ ముగిసిన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసలు గొడవ జరగడానికి గల కారణాల గురించి ఫిలింనగర్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

కనీసం 15 ఏళ్లు కూడా నిండని ఈ యువకులకు చట్టం అంటే భయం లేదు, పెద్దలంటే గౌరవం తెలియడం లేదు. అడ్డొస్తే ఎవరినైనా కొట్టే విధంగా తయారయ్యారు. ఫిలింనగర్ ప్రాంతంలో గంజాయి తాగే గ్యాంగ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గంజాయి మత్తులో అమ్మాయిల వెనుక తిరగడం, ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేయడం వంటి ఘటనలు ఎక్కువవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.

గంజాయి తాగుతూ పట్టుబడిన యువతకు పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడం లేదా ఒకటి రెండు రోజులు స్టేషన్‌లో ఉంచి పంపించడం చేస్తున్నారు. కానీ వారు బయటకు వచ్చాక మళ్ళీ యధావిధిగా అరాచకాలకు పాల్పడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *