Rakul Preet Brother

Rakul Preet Brother: టాలీవుడ్ డ్రగ్స్ సెగ.. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ సోదరుడు పరారీ

Rakul Preet Brother: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు, కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా మాసబ్‌ట్యాంక్ వేదికగా బయటపడిన డ్రగ్స్ నెట్‌వర్క్ సినీ, వ్యాపార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఖరీదైన మత్తు.. వ్యాపారవేత్తల అరెస్ట్

తెలంగాణ పోలీసుల ప్రత్యేక విభాగం ‘ఈగల్ టీమ్’ మరియు మాసబ్‌ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు బడా వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి సుమారు 43 గ్రాముల కొకైన్ మరియు ఎండిఎంఏ (MDMA) స్వాధీనం చేసుకున్నారు.

కస్టమర్ లిస్టులో హీరోయిన్ సోదరుడు!

పోలీసుల విచారణలో పట్టుబడ్డ వ్యాపారవేత్తలు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. వీరికి ఉన్న రెగ్యులర్ కస్టమర్లలో అమన్ ప్రీత్ సింగ్ ఒకరని, అతను తరచుగా వీరి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలింది.

గతంలోనూ సైబరాబాద్ పోలీసులకు డ్రగ్స్ కేసులో పట్టుబడిన అమన్, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నట్లు సమాచారం.పోలీసుల దాడి విషయాన్ని పసిగట్టిన అమన్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

టాలీవుడ్‌లో మళ్లీ కలవరం

గతంలో పలువురు సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసుల్లో నోటీసులు అందుకోవడం, విచారణకు హాజరుకావడం చూశాం. అయితే, మళ్ళీ ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ కుటుంబ సభ్యుడి పేరు రావడం ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. విదేశీ మూలాలున్న ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో ‘ఈగల్ టీమ్’ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

పోలీసుల హెచ్చరిక: హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చడమే మా లక్ష్యం. సెలబ్రిటీలైనా, వ్యాపారవేత్తలైనా.. చట్టం ముందు అందరూ సమానమే. మత్తు పదార్థాల సరఫరాలో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *