Cyber Fraud

Cyber Fraud: ఫేస్‌బుక్‌లో ‘హాయ్’తో పరిచయం.. డెంటల్ డాక్టర్‌కు రూ.14 కోట్లు టోకరా!

Cyber Fraud: ఒకప్పుడు దొంగలు అర్థరాత్రి ఇళ్లలోకి చొరబడి దొంగతనాలు చేసేవారు, అడ్డువస్తే హింసించేవారు. కానీ ఇప్పుడు ఆ పాత పద్ధతులు మారిపోయాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు సైబర్ నేరాలే ప్రధాన సమస్యగా మారుతున్నాయి. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఇళ్లల్లో దొంగతనాల కేసులు తగ్గినా, సైబర్ మోసాల సంఖ్య మాత్రం పెరుగుతూ పోతోంది. ఈ పెరుగుదల ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోంది.

తాజాగా, హబ్సిగూడ ప్రాంతానికి చెందిన ఒక డెంటల్ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు నిలువునా మోసం చేశారు. ఏకంగా 14 కోట్ల రూపాయల పెద్ద మొత్తంలో డబ్బును కొట్టేశారు. ఒక అమ్మాయి పేరుతో వచ్చిన మెసేజ్‌కు డాక్టర్ స్పందించడమే ఈ భారీ మోసానికి ప్రధాన కారణం. వివరాల్లోకి వెళ్తే…

పోలీసులు తెలిపిన కథనం ప్రకారం, హబ్సిగూడకు చెందిన ఆ డెంటల్ డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో మౌనిక అనే పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. తాను చాలా కష్టాల్లో ఉన్నానని, ఆదుకోవాలని ఆ మెసేజ్‌లో కోరింది. దానికి ఆ వైద్యుడు స్పందించాడు, ఆమె రిక్వెస్ట్‌ను అంగీకరించాడు. మౌనిక మాయమాటలు చెప్పి డాక్టర్‌ను నమ్మించింది. ఆ తర్వాత మెల్లిగా, విదేశాల్లోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో పెట్టుబడి పెడితే పెద్ద లాభాలు వస్తాయని అతన్ని నమ్మించింది.

ఈ క్రమంలో, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ అకౌంట్‌ను ఓపెన్ చేయించింది. మొదట్లో ఈ నిందితురాలు క్రిప్టో లావాదేవీల ద్వారా డాక్టర్‌కు పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్టు చూపించింది. అయితే, ఆ డబ్బును విత్‌డ్రా చేసుకోవాలంటే, ట్యాక్స్ (పన్ను) రూపంలో కొంత మొత్తం చెల్లించాలంటూ బుకాయించింది. ఈ మాటలు నమ్మిన డాక్టర్, ట్యాక్స్ పేరుతో ఏకంగా మూడున్నర కోట్ల రూపాయలు చెల్లించాడు. ఆ తర్వాత కూడా డబ్బులు తిరిగి రాకపోవడంతో, మొత్తం 91 సార్లు మౌనిక ఆ డాక్టర్ నుంచి డబ్బు తీసుకున్నట్లు తేలింది. చివరకు, మోసపోయానని గ్రహించిన ఆ వైద్యుడు టీఎస్ సైబర్ బ్యూరోను ఆశ్రయించాడు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *