Hyderabad: గచ్చిబౌలిలో ఈగల్ టీమ్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ భారీగా కలకలం రేపింది. గంజాయి కొనుగోలు చేస్తుండగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, డెంటల్ టెక్నిషియన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మార్కెటింగ్ ఉద్యోగులు, హెచ్‌ఆర్ మేనేజర్లు సహా మొత్తం 86 మందిని పోలీసులు పట్టుకున్నారు.
ఈగల్ టీమ్ వివరించిన వివరాల ప్రకారం, గంజాయిని కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూపుల ద్వారా విక్రయిస్తున్నారు. “భాయ్ బచ్చా ఆగయా” అనే కోడ్ వాక్యంతో గంజాయి వచ్చినట్లు సిగ్నల్ ఇస్తున్నారు. వినియోగదారులకు గంజాయి డెలివరీ చేసే విధంగా వ్యవస్థను నిర్వహిస్తున్నారు.
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు డెకాయ్ ఆపరేషన్‌కు దిగారు. ముందుగా ముమ్మరంగా గమనించిన పోలీసులు మాదకద్రవ్యాల విక్రయదారులతో పాటు కొనుగోలుదారులను కూడా పట్టుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిలో పలువురు టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ రంగాల్లో పనిచేస్తున్నవారు ఉండటంతో ఇది మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈగల్ టీమ్ తెలిపిన వివరాల ప్రకారం, పట్టుబడిన వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగంపై పోలీస్ శాఖ తీవ్రంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. యువతను నాశనం చేసే డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ఇలాంటి ఆపరేషన్లు కొనసాగుతాయని హెచ్చరించారు.