CP Sajjanar: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలపై 2025 సంవత్సరానికి సంబంధించిన వార్షిక క్రైమ్ నివేదికను పోలీస్ కమిషనర్ సజ్జనార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, గత ఏడాదితో పోలిస్తే నగరంలో మొత్తం నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు. 2024–25 కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేటు సుమారు 15 శాతం మేర తగ్గినట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయని తెలిపారు.
వార్షిక నివేదిక ప్రకారం 2024లో నగరంలో మొత్తం 35,944 కేసులు నమోదవగా, 2025లో ఆ సంఖ్య 30,690కు తగ్గింది. పోలీస్ శాఖ చేపట్టిన కఠిన చర్యలు, తక్షణ ఎఫ్ఐఆర్ నమోదు విధానం, ఆధునిక సాంకేతికత వినియోగం, ప్రజల నుంచి లభించిన సహకారం వల్లే ఈ తగ్గుదల సాధ్యమైందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. నగరంలో ఎక్కడ నేరం జరిగినా తప్పించుకోలేమన్న భావన నేరగాళ్లలో ఏర్పడిందని, దాంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే గ్యాంగ్‌లు కూడా హైదరాబాద్ వైపు రావడానికి భయపడుతున్నాయని చెప్పారు.
కేసుల విభాగాల వారీగా చూస్తే, బీఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ కేటగిరీ కేసులు గత ఏడాది 28,005 నుంచి ఈ ఏడాది 24,027కు తగ్గి దాదాపు 14 శాతం తగ్గుదల నమోదైంది. శారీరక నేరాలు 8,447 నుంచి 7,064కు తగ్గాయి. హౌస్ బ్రేకింగ్ కేసులు 700 నుంచి 672కు తగ్గగా, కామన్ ఫిజికల్ అఫెన్సెస్ 7,747 నుంచి 6,392కు చేరి సుమారు 17 శాతం తగ్గాయి. ఆస్తి సంబంధిత నేరాలు 5,328 నుంచి 3,817కు తగ్గి 28 శాతం తగ్గుదల నమోదు కాగా, సీరియస్ ప్రాపర్టీ క్రైమ్స్ 315 నుంచి 217కు తగ్గి 31 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.
Also Read: Nagababu: మీకు ఆ హక్కు ఎవరిచ్చారు?శివాజీ కామెంట్స్ పై నాగబాబు సీరియస్
సైబర్ నేరాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సీపీ తెలిపారు. 2024లో నమోదైన 4,042 సైబర్ కేసులు 2025లో 3,735కు తగ్గి దాదాపు 8 శాతం తగ్గాయి. ఈ కేసుల సంబంధంగా 566 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అలాగే డ్రగ్స్ నియంత్రణలో భాగంగా రూ.6.5 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను సీజ్ చేసినట్లు తెలిపారు.
అయితే మహిళలపై నేరాల విషయంలో స్వల్ప పెరుగుదల నమోదైనట్లు నివేదిక స్పష్టం చేసింది. గత ఏడాది 2,482 కేసులు నమోదుకాగా, ఈ ఏడాది 2,625 కేసులు నమోదయ్యాయి. ఇది సుమారు 6 శాతం పెరుగుదలగా సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కాలంలో 405 అత్యాచార కేసులు, 119 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే పిల్లలపై నేరాలు (పోక్సో కేసులు) 449 నుంచి 568కు పెరిగి 27 శాతం మేర పెరిగినట్లు గణాంకాలు చూపుతున్నాయని తెలిపారు.
మొత్తంగా చూస్తే, హైదరాబాద్ నగరంలో నేరాల నియంత్రణలో పోలీస్ శాఖ గణనీయమైన పురోగతి సాధించిందని, అయితే మహిళలు, పిల్లల భద్రతపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో కూడా సాంకేతికత, కఠిన చర్యలతో నేరాలను మరింత తగ్గించే దిశగా చర్యలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
