Hyderabad: హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని సింగరేణి కాలనీలో హృదయం ద్రవించే ఘటన వెలుగులోకి వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దంపతుల 8 ఏళ్ల కుమార్తెపై ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సుమారు పదిహేను రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సైదాబాద్ సింగరేణి కాలనీలో నివసించే ఆ దంపతులు కూతురు (8), కుమారుడు (7)లను ఇంట్లో ఉంచి పనికి వెళ్లారు. అదే సమయంలో, నిందితుడైన యువకుడు ఇద్దరు చిన్నారులను తన ఇంటికి పిలిచాడు. అనంతరం గంజాయి మత్తులో ఉన్న ఆ యువకుడు చిన్నారి తమ్ముడి ముందే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని ఆ చిన్నారులను బెదిరించాడు.
Also Read: Crime News: పెళ్ళైన నాలుగు నెలలకే వరకట్నం కోసం భర్తే భార్యను చంపి పరార్
ఈ దారుణం జరిగిన తర్వాత బాలిక అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులు ఆరా తీయగా, బాలిక చిన్న తమ్ముడు ధైర్యం చేసి జరిగిన వాస్తవాన్ని వారికి తెలియజేశాడు. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు, ఆలస్యం చేయకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) సహాయంతో సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణానికి పాల్పడి ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. సమాజంలో చిన్నారులకు రక్షణ కరువైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనను సృష్టించింది.