Telangana: హైదరాబాద్ నగర పోలీసులు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, యువతలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు సరికొత్త బాటలు వేస్తున్నారు. నేటితరం విద్యార్థులకు పోలీసింగ్ వ్యవహారశైలిని పరిచయం చేస్తూ, వారిని సామాజిక బాధ్యతలో భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ఒక ప్రత్యేక ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రకటించారు. డేటా అనాలసిస్, రీసెర్చ్ ప్రాజెక్టులు మరియు ఆధునిక టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌లో విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ అవకాశాన్ని 25 ఏళ్ల లోపు వయసున్న డిగ్రీ లేదా పీజీ చదువుతున్న విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. పోలీసులు చేసే పనుల్లో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది? నేరాలను అదుపు చేయడంలో డేటా పాత్ర ఏంటి? వంటి కీలక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ఈ ప్రోగ్రామ్‌ను పోలీసు శాఖలోని ఎస్ఎమ్ఐటీ (SMIT) సెల్ నేరుగా పర్యవేక్షిస్తుంది. తమ చదువుతో పాటు సమాజానికి ఉపయోగపడే కొత్త విషయాలను నేర్చుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి వేదిక.
ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు హైదరాబాద్ సిటీ పోలీస్ నుండి అధికారిక ధ్రువపత్రం అందజేస్తారు. ఇది భవిష్యత్తులో వారి కెరీర్‌కు ఎంతో ప్లస్ అవుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే పోలీసు శాఖ అధికారిక వెబ్సైట్ www.hyderabadpolice.gov.in సందర్శించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్ వ్యవస్థ ఉన్న హైదరాబాద్ పోలీసులతో కలిసి పనిచేసే ఈ అవకాశాన్ని యువత జారవిడుచుకోకండి.
