Chutney Murder: హైదరాబాద్ నగరంలో అత్యంత కిరాతకమైన హత్య జరిగింది. టిఫిన్ చేస్తుండగా అనుకోకుండా తమపై చట్నీ పడిందన్న కోపంతో నలుగురు యువకులు (ఒక మైనర్ సహా) ఒక వ్యక్తిని రెండు గంటలపాటు కారులో తిప్పుతూ చిత్రహింసలు పెట్టి, చివరకు కత్తితో పొడిచి హతమార్చారు.
ఘటన వివరాలు, హింస
మహమ్మద్ జునైద్ (18), షేక్ సైఫుద్దీన్ (18), మణికంఠ (21), మరియు ఒక 16 ఏళ్ల బాలుడు. వీరు నాచారం ప్రాంతానికి చెందినవారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో సరదాగా కారులో తిరుగుతున్న ఈ నలుగురు యువకులను ఎల్బీ నగర్ వద్ద మురళి కృష్ణ లిఫ్ట్ అడిగాడు. దారి మధ్యలో ఎన్జీఆర్ఐ ప్రాంతంలో యువకులతో కలిసి మురళి కృష్ణ టిఫిన్ చేస్తుండగా, అనుకోకుండా ఒక యువకుడిపై చట్నీ పడింది.
ఇది కూడా చదవండి: Nara Bhuvaneshwari: లండన్లో 2 ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నారా భువనేశ్వరి
‘నా మీదే చట్నీ పోస్తావా’ అంటూ రెచ్చిపోయిన యువకులు, మురళి కృష్ణను కారులో బలవంతంగా ఎక్కించుకుని పిడిగుద్దులు గుద్దుతూ హింసించారు. రెండు గంటలపాటు నగరం చుట్టూ తిప్పుతూ, అతడిని సిగరెట్లతో కాల్చుతూ నరకం చూపించారు. మురళి కృష్ణ వారి నుంచి తప్పించుకోవడానికి కారు దూకి పారిపోతుండగా, వెంబడించి మరీ కత్తితో కిరాతకంగా పొడిచి హతమార్చారు.
పోలీసుల దర్యాప్తు, అరెస్ట్
మురళి కృష్ణ చనిపోయాడని నిర్ధారించుకున్న నిందితులు, మార్గ మధ్యలో కత్తి పడేసి, మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ ప్రాంతంలో కారు పార్క్ చేసి పారిపోయారు.పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి, నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని గుర్తించారు.నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు, వారిని రిమాండ్కు తరలించారు. కేవలం ‘చట్నీ పడింది’ అనే చిన్న కారణంతో ఒక వ్యక్తిని ఇంత కిరాతకంగా హత్య చేయడం హైదరాబాద్లో తీవ్ర సంచలనం సృష్టించింది.

