Hyderabad: హైదరాబాద్ అంటేనే బిర్యానీకి కేరాఫ్ అడ్రస్. వేడివేడి బిర్యానీ ముక్క తింటూ మనం ఎంజాయ్ చేస్తుంటాం కానీ, ఆ ప్లేటు వెనుక వేల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని ఎవరైనా ఊహించారా? మనం హోటల్లో బిల్లు కట్టినప్పుడు అందులో జీఎస్టీ (GST) కూడా ఉంటుంది. అంటే మనం ప్రభుత్వానికి పన్ను కడుతున్నామన్నమాట. కానీ, ఆ పన్ను డబ్బులు ప్రభుత్వానికి వెళ్లకుండా కొందరు హోటల్ యజమానులు తమ జేబుల్లో వేసుకుంటున్నారు. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా దాదాపు రూ. 70,000 కోట్ల మేర పన్ను ఎగవేత జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఈ మోసం ఎలా జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. హోటల్ యజమానులు వాడే బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో ఒక చిన్న ‘ట్రిక్’ ప్లే చేస్తున్నారు. మనం తిన్న బిర్యానీకి బిల్లు ఇస్తారు, మనం డబ్బులు కడతాం. కానీ, రోజు చివరలో సిస్టమ్ నుండి ఆ బిల్లులను మాయం చేస్తున్నారు. ముఖ్యంగా నగదు (Cash) రూపంలో ఇచ్చే బిల్లులను లెక్కల్లో చూపడం లేదు. ఇలా అమ్మకాలను తక్కువ చేసి చూపడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రాకుండా పోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో అధికారులు సుమారు 1.77 లక్షల రెస్టారెంట్లకు చెందిన డేటాను తనిఖీ చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోనే సుమారు రూ. 5,100 కోట్ల విలువైన అమ్మకాలను రికార్డుల్లో చూపలేదని తేలింది. హైదరాబాద్‌లో రోజుకు లక్షల ప్లేట్ల బిర్యానీ అమ్ముడవుతున్నా, ప్రభుత్వానికి చూపే లెక్కల్లో మాత్రం ఆ జోరు కనిపించడం లేదు. కొన్ని హోటళ్లు అయితే ఏకంగా కొన్ని రోజుల వ్యాపారాన్నే సిస్టమ్ నుండి డిలీట్ చేసేస్తున్నాయంటే మోసం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ స్కామ్‌లో కేవలం హోటల్ యజమానులే కాకుండా, వారికి సహకరించిన కొన్ని సాఫ్ట్వేర్ సంస్థల హస్తం కూడా ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేవలం 40 హోటళ్లలో సోదాలు చేస్తేనే రూ. 400 కోట్ల అక్రమ అమ్మకాలు బయటపడ్డాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న వేల హోటళ్లలో తనిఖీలు చేస్తే ఈ స్కామ్ విలువ లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సామాన్యుల దగ్గర ముక్కుపిండి పన్ను వసూలు చేస్తున్న రెస్టారెంట్లు, ఆ సొమ్మును ప్రభుత్వానికి కట్టకుండా మోసం చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
