Koti ATM Firing: హైదరాబాద్‌లోని కోఠి/అబిడ్స్ దగ్గర ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం వద్ద జరిగిన కాల్పుల కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిని హర్యానాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసు: హర్యానాలో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన కోఠిలో కేరళకు చెందిన వస్త్ర వ్యాపారిపై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న కేసులో పోలీసులు హర్యానాలో ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ అంతర్రాష్ట్ర ముఠా గత మూడు నెలలుగా ఈ దోపిడీకి పక్కా స్కెచ్ వేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడు అందించిన సమాచారం మేరకు పరారీలో ఉన్న మరో దుండగుడి కోసం పోలీసులు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ – హర్యానా రాష్ట్రాల్లో గాలిస్తున్నారు.
అసలేం జరిగింది?
కేరళలోని కోజికోడ్‌కు చెందిన రిన్షద్ (26) అనే వస్త్ర వ్యాపారి వ్యాపార నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి నాంపల్లిలో ఉంటున్నారు. జనవరి 31, 2026 శనివారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో కోఠిలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం వద్ద రూ. 6 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు రిన్షద్ వెళ్లారు.
అప్పటికే ఆయనపై నిఘా ఉంచిన ఇద్దరు దుండగులు, రిన్షద్ నగదు డిపాజిట్ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి తుపాకీతో బెదిరించారు. ఈ క్రమంలో నిందితులు రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ రిన్షద్ కుడి కాలికి తగిలి తీవ్ర గాయమైంది. అనంతరం దుండగులు నగదు సంచిని, బాధితుడి స్కూటీని లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
పోలీసుల దర్యాప్తు.. నిందితుల వేట
ఘటన తర్వాత నిందితులు తమ ఆనవాళ్లు దొరక్కుండా తెలివిగా వ్యవహరించారు. దోపిడీ చేసిన స్కూటీని కాచిగూడ వద్ద వదిలివేసి, బట్టలు మార్చుకుని ఆటోలో పాతబస్తీ వైపు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాకు హైదరాబాద్‌లో ఆశ్రయం కల్పించిన పాతబస్తీకి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం హర్యానాలో పట్టుబడిన నిందితుడి ద్వారా ఈ ముఠా వెనుక ఉన్న మరిన్ని వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బాధితుడి కదలికలపై వీరు ముందుగానే రెక్కీ నిర్వహించారని, అందుకే ఆయన ఏ సమయంలో నగదు డిపాజిట్ చేస్తారనే విషయం వారికి తెలుసని పోలీసులు నిర్ధారించారు.
