Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ‘జీరో ఎన్‌రోల్మెంట్’ ప్రభుత్వ పాఠశాలలపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇలాంటి పాఠశాలలను జిల్లా పాఠశాల విద్యా సమాచార గణాంకాల్లో చూపించబోమని అధికారులు తెలిపారు.
2024–25 విద్యా సంవత్సరపు లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 2,245 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా నమోదు కాలేదు. దేశంలోనే అత్యధికంగా జీరో ఎన్‌రోల్మెంట్ పాఠశాలలు తెలంగాణలోనే ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
పాఠశాల విద్యా శాఖ పరిధిలో ఉన్న పాఠశాలల్లో 1,441 చోట్ల విద్యార్థులు లేకపోవడమే కాకుండా ఉపాధ్యాయ పోస్టులు కూడా లేవు. మరో 600 పాఠశాలల్లో విద్యార్థులు లేకున్నా ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు లేని 1,441 పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. మిగిలిన పాఠశాలలపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
గ్రామాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు ముందుకు వస్తే, ఆయా పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యాశాఖ స్పష్టం చేసింది. అవసరమైతే ఉపాధ్యాయులను కూడా నియమిస్తామని పేర్కొంది.
మారుమూల ప్రాంతాలు, శివారు తండాల్లో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ ఏడాది ఇప్పటికే 200 కొత్త పాఠశాలలను ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తు చేశారు.
