Hyderabad: ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. సీటింగ్ బస్సుకి రిజిస్ట్రేషన్ చేయించి, తర్వాత దాన్ని అక్రమంగా స్లీపర్ బస్సుగా మార్చి నడుపుతున్న వ్యవహారాలు బహిర్గతమవుతున్నాయి.
తెలంగాణలో 2018లో రిజిస్ట్రేషన్ చేసిన వేమూరి కావేరి స్లీపర్ బస్సు దీనికి ప్రధాన ఉదాహరణగా మారింది. మొదట సీటింగ్ బస్సుగా అనుమతి పొందిన ఈ వాహనాన్ని యాజమాన్యం తర్వాత 2023లో NOC తీసుకుని డయ్యూ డామన్‌లో తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. తర్వాత నేషనల్ పర్మిట్ పొందడంతో దేశవ్యాప్తంగా నడపడం ప్రారంభించింది.
ఇదే క్రమంలో, ఒడిశా రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో బస్సుకు ఆల్ట్రేషన్ చేయించి, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ బస్సు 43 సీట్ల సీటింగ్ వాహనంగా పర్మిషన్ పొందినా, ఆ అనుమతిని స్లీపర్‌గా మార్చి నడిపేలా రాయగడ RTA అధికారులు అనుమతిచ్చారు.
ప్రతిచోటా అధికారులతో కుమ్మక్కై ఆల్ట్రేషన్‌లు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ రకమైన అక్రమ మార్పులు ప్రయాణికుల భద్రతకు పెద్ద ముప్పుగా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ట్రావెల్స్ దందాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

