Hyderabad: నిమెసులైడ్ (Nimesulide) 100 ఎంజీ కంటే అధిక మోతాదులో ఉన్న మందులను ప్రజలు వినియోగించవద్దని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ మందులు ఆరోగ్యానికి హానికరమని పేర్కొంటూ, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాటి తయారీ, విక్రయం, పంపిణీని దేశవ్యాప్తంగా నిషేధించినట్లు అధికారులు తెలిపారు.
నొప్పి నివారణకు వాడే నాన్-స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అయిన నిమెసులైడ్, కాలేయంపై (లివర్) తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు సూచనలతో, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్–1940లోని సెక్షన్ 26ఏ కింద 100 ఎంజీకి మించి ఉన్న నిమెసులైడ్ మందులను నిషేధిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
ప్రస్తుతం ఈ తరహా మందులు వాడుతున్న వారు వెంటనే వాటిని నిలిపివేసి, సురక్షితమైన ప్రత్యామ్నాయ చికిత్స కోసం అర్హులైన వైద్యులను సంప్రదించాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసిం సూచించారు. నిషేధిత మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయవద్దని, ఇళ్లలో నిల్వ ఉంచుకోవద్దని ప్రజలను కోరారు.
మార్కెట్‌లో ఉన్న నిషేధిత మందులను పూర్తిగా తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. సంబంధిత ఫార్మా కంపెనీలు వెంటనే ఉత్పత్తిని నిలిపివేసి, మార్కెట్‌లో ఉన్న స్టాక్‌ను వెనక్కి పిలిపించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఈ మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే, సమీప డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ లేదా డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు..
