Crime News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా భార్య చేసిన అవమానకర వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన భర్త హరీశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచిన ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే…
తడగొండ గ్రామానికి చెందిన హరీశ్ (వయసు 36)కు 2014లో కరీంనగర్ జిల్లా బద్దిపెల్లి గ్రామానికి చెందిన కావేరి అనే మహిళతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చేందుకు హరీశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అయితే హరీశ్ దుబాయ్ లో ఉన్న సమయంలో కావేరి మరో వ్యక్తి రక్షణ్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుస్తోంది.
ఈ వ్యవహారాన్ని తెలుసుకున్న హరీశ్ ఫోన్ ద్వారా భార్యతో ఘర్షణకు దిగాడు. దీనితో ఈ నెల 8న ఆయన స్వగ్రామమైన తడగొండకు వచ్చాడు. భార్య కావేరి నేరుగా “నువ్వు నాకు వద్దు.. చచ్చిపో.. నేను రక్షణ్ తోనే ఉంటా” అంటూ భర్తను కించపరిచిందట.
ఈ మాటలు ఆత్మగౌరవాన్ని తాకడంతో తీవ్ర మనస్థాపానికి గురైన హరీశ్ “బయటకి వెళ్తున్నాను” అంటూ బయటకు వెళ్లి గ్రామంలోని ఓ వ్యవసాయ బావిలో దూచి ఆత్మహత్య చేసుకున్నాడు.
కేసు నమోదు – దర్యాప్తులో పోలీసులు
ఘటనపై హరీశ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, భార్య కావేరి, ఆమె సహచరుడు రక్షణ్ పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసును అన్ని కోణాల్లో పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

