Medchal: మేడ్చల్ జిల్లా మేడిపల్లి బాలాజీహిల్స్‌లో చోటుచేసుకున్న హత్య సంఘటన స్థానికులను షాక్‌కు గురి చేసింది. గర్భవతైన భార్యను భర్త ముక్కలుగా నరికి చంపేసిన ఘటన బయటపడింది. ఈ ఘోరానికి పాల్పడిన నిందితుడు మహేందర్‌రెడ్డి (వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడ)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్వాతి (25), మహేందర్‌రెడ్డి ఇద్దరూ పక్కపక్క ఇళ్లలో పెరిగారు. వీరిద్దరూ ప్రేమించి కుటుంబాల అంగీకారం లేకుండా కొన్ని నెలల క్రితం వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత స్వాతి భర్తతో పాటు అత్తమామల నుండి కూడా వేధింపులు ఎదుర్కొంటూ వచ్చిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. స్వాతి తన తల్లిదండ్రులతో మాట్లాడనివ్వకుండా మహేందర్ తరచూ అడ్డం పెట్టేవాడని సమాచారం.
నెల క్రితం బోడుప్పల్‌లోని శ్రీనివాసనగర్‌లో అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించిన ఈ దంపతులు తరచూ గొడవపడేవారు. ఇదే నేపథ్యంలో మేడిపల్లి బాలాజీహిల్స్‌లోని గృహంలో భార్యపై మహేందర్ దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి కొన్ని భాగాలను కవర్‌లో పెట్టి బయట పడేయడానికి ప్రయత్నించాడు. పొరుగువారు గదిలో అనుమానాస్పద శబ్దాలు విని లోపలికి వెళ్లి చూడగా విషయం బహిర్గతమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
Also Read: Sahastra Murder Case: సహస్ర హత్య కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు
అదుపులోకి తీసుకున్న మహేందర్‌రెడ్డి విచారణలో తన భార్య మృతదేహంలోని తల, చేతులు, కాళ్లను మూసీ నదిలో పడేశానని ఒప్పుకున్నాడు. దీంతో ప్రతాప్ సింగారం పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. మూసీ ఇరువైపులా ట్రాఫిక్‌ను నిలిపివేసి శరీరభాగాల కోసం శోధన కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో మృతురాలు స్వాతి తల్లి కన్నీటి పర్యంతమవుతూ నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తోంది. భర్తే కాకుండా అత్తమామలే తన కుమార్తెకు జీవితం నరకంగా మార్చారని ఆరోపించింది. స్థానికులు కూడా మహేందర్ ప్రవర్తన ఎప్పటినుంచో వింతగానే ఉందని చెబుతున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మహేందర్ తల్లిదండ్రులను కూడా విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. గర్భిణి హత్య ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.