Crime News: సంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా జంట హత్యల వార్త కలకలం రేపింది. పఠాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. నివసించేందుకు వచ్చిన చోటే ఆ దంపతులు శవాలై పడి ఉండటం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొంగచింత తండాకు చెందిన సోమ్లానాయక్ (50), ఆయన భార్య మాన్యమ్మ (45) ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు.
వీరు గత కొంతకాలంగా ఇంద్రేశం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఒక భవనానికి వాచ్‌మెన్‌గా పని చేస్తూ అక్కడే నివసిస్తున్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి సమయంలో వారిపై దాడి చేసి అత్యంత దారుణంగా కొట్టి చంపారు. ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి, క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ జంట హత్యలకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పాత కక్షల వల్ల ఎవరైనా చంపారా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో ఇలాంటి ఘోరం జరగడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.
