Maoist Party: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్ల రాజిరెడ్డి తన అనుచరులతో కలిసి పోలీసులకు లొంగిపోయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాజిరెడ్డితో పాటు దాదాపు మరో 25 మంది కీలక సభ్యులు తెలంగాణ డీజీపీ జితేందర్ ముందు లొంగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిజానికి వీరు స్వచ్ఛందంగా లొంగిపోయారా లేక పోలీసులే వారిని పట్టుకున్నారా అనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కర్రీగుట్ట అటవీ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన ఆపరేషన్లో వీరంతా చిక్కినట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై పోలీసులు ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు, ఈ ఘటనపై ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అడవిలో ఉన్న వారిని అరెస్ట్ చేసి, బలవంతంగా లొంగుబాటుగా చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ అయిన వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ప్రభుత్వం వెంటనే అసలు నిజాన్ని బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన మార్చి 31 గడువు లోపే ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో అటు పోలీసు వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
