Hyderabad

Hyderabad: ఇంటి యజమాని నీచమైన ప్లాన్.. అద్దెకుంటున్న వారి బాత్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు.. చివరికి ఏమైందంటే!

Hyderabad: హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అద్దె ఇంట్లో ఉన్న బాత్రూమ్‌లో యజమాని సీక్రెట్ కెమెరా ఏర్పాటు చేయించడం కలకలం రేపింది. ఎలక్ట్రీషియన్‌తో కలిసి వేసిన ఈ ప్లాన్ చివరికి యజమానిని ఊచల వెనక్కి పంపింది.

మధురానగర్‌లోని జవహర్‌నగర్‌లో ఉన్న అశోక్ అనే వ్యక్తి ఇంట్లో ఓ జంట అద్దెకు ఉంటోంది. ఇటీవల వారి బాత్రూమ్‌లోని బల్బు పనిచేయకపోవడంతో యజమాని అశోక్‌కు తెలిపారు. దీంతో అశోక్ అక్టోబర్ 4వ తేదీన చింటూ అనే ఎలక్ట్రీషియన్‌ను ఇంటికి పిలిపించాడు. ఇక్కడే యజమాని అశోక్, ఎలక్ట్రీషియన్ చింటూ కలిసి ఓ దారుణమైన ప్లాన్ వేశారు.

బల్బు హోల్డర్‌ను సెట్ చేస్తున్న నెపంతో అందులో సీక్రెట్ కెమెరాను అమర్చారు. ఆ విషయం తెలియని ఆ అద్దె దంపతులు తమ రోజువారీ పనుల్లో మునిగిపోయారు. అయితే, అక్టోబర్ 13వ తేదీన వారికి అనుమానం వచ్చి బల్బు హోల్డర్‌ను జాగ్రత్తగా పరిశీలించారు. అందులో సీక్రెట్ కెమెరా ఉండటాన్ని చూసి వారు అవాక్కయ్యారు.

వెంటనే ఇంటి యజమాని అశోక్‌ను నిలదీయగా, అతడు మొదట దాన్ని మార్చివేశాడు. అంతేకాక, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలక్ట్రీషియన్‌ పగబడతాడని బెదిరించాడు కూడా. యజమాని ప్రవర్తనపై అనుమానం పెరిగిన అద్దె దంపతులు నేరుగా మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఇంటి యజమాని అశోక్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అశోక్ అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ మాస్టర్ ప్లాన్‌లో భాగమైన ఎలక్ట్రీషియన్‌ చింటూ మాత్రం పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అత్యంత గోప్యత ఉండే ప్రదేశంలో ఇలాంటి కెమెరాలను అమర్చడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చర్చనీయాంశమైంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *