Hyderabad: హైదరాబాద్ నగర ఆకాశంలో రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్లు సందడి చేస్తున్నాయి. చారిత్రక గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ అద్భుతమైన ‘హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్’ శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా మొదలైంది. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలను స్వయంగా ప్రారంభించడమే కాకుండా, స్వయంగా బెలూన్‌లో ప్రయాణించి అందరినీ ఉత్సాహపరిచారు. గోల్ఫ్ క్లబ్ నుంచి గాలిలోకి ఎగిరిన ఈ బెలూన్ సుమారు గంటన్నర పాటు ఆకాశంలో విహరిస్తూ 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అప్పాజీగూడ శివారులో సురక్షితంగా దిగింది. ఈ ప్రయాణం తనకు ఒక మరుపురాని అనుభూతిని ఇచ్చిందని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఈ ఫెస్టివల్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక పక్క రాష్ట్ర సంస్కృతిని చాటిచెప్పే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుండగా, మరోపక్క ఈ హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ షోల ద్వారా ఆధునిక సాంకేతికతను పర్యాటకులకు పరిచయం చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ‘డెస్టినేషన్ తెలంగాణ’ అనే బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
Also Read: Bangladesh Players: బంగ్లాదేశ్ క్రికెటర్ల సమ్మె విరమణకు గ్రీన్ సిగ్నల్.. క్షమాపణ చెబితే మైదానంలోకి!
ఈ పండుగలో పాల్గొనే పర్యాటకులకు కేవలం చూడటమే కాకుండా, బెలూన్ రైడ్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే హాట్ ఎయిర్ బెలూన్ షో సందర్శకులకు కనువిందు చేయనుంది. జనవరి 18వ తేదీ వరకు కొనసాగే ఈ వేడుకలు దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయని పర్యాటక శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. వినూత్న ఆలోచనలతో పర్యాటక రంగంలో తెలంగాణ కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సాహస క్రీడలను అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు.
