Crime News: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ (కేపీహెచ్‌బీ) కాలనీలో షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డు నంబర్ 5 దగ్గర ఉన్న ఒక హాస్టల్‌లో ఉండే సుమారు 30 మంది యువకులు ఒక కుటుంబంపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.
అసలేం జరిగింది?
రోడ్డు నంబర్ 5లో నివాసం ఉంటున్న ఒక కుటుంబం ఇంటి ముందు హాస్టల్ కుర్రాళ్లు తరచూ తమ బైకులను నిలుపుతున్నారు. దీనిపై ఆ కుటుంబ సభ్యులు పలుమార్లు హాస్టల్ పిల్లలకు చెప్పారు, అలాగే హాస్టల్ మేనేజ్‌మెంట్‌కి కూడా ఫిర్యాదు చేశారు. కానీ, ఎవరు పట్టించుకోలేదు.
తాజాగా, బయట పెట్టిన ఒక బైక్ సీటు కవర్ ఎవరో కట్ చేశారని కోపం పెంచుకున్న హాస్టల్ యువకులు, ఆ కుటుంబంపై దాడికి దిగారు. ఏకంగా 30 మందికి పైగా యువకులు కలిసి ఇంటిపై దాడి చేశారు. వారిలో కొందరు ఇంట్లోకి చొరబడి ఇంటిల్లిపాదిని కొట్టారు. ఇంట్లో ఉన్న మహిళపై కూడా దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దారుణంగా దాడి చేసిన యువకులపై, అలాగే వారిని అదుపు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ సంఘటనపై విచారణ మొదలుపెట్టారు.