Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో హృదయాన్ని కలచివేసే సంఘటన వెలుగు చూసింది. కన్నతల్లి, ఆమె పెంపుడు తండ్రి కలిసి నాలుగేళ్ల చిన్నారిపై దారుణంగా దాడి చేసి హింసించారు. ఈ సంఘటన స్థానికులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మియాపూర్ పరిధిలోని హఫీజ్‌పేట్ ప్రాంతంలో నివసించే నజ్వీమ్ అనే మహిళ, తన మొదటి భర్త తాజుద్దీన్‌తో విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల, నజ్వీమ్ జోగిపేట్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఎండీ జావేద్‌ను రెండో వివాహం చేసుకుంది.
Also Read: Tirupati: అరేయ్ ఏంట్రా.. ఇలా ఉన్నారు – అల్లుడితో పెళ్లికి అత్త యత్నం: కూతురిపై దాడి
జావేద్‌తో పెళ్లయినప్పటి నుంచి, నజ్వీమ్-జావేద్ ఇద్దరూ కలిసి ఈ చిన్న పిల్లలను హింసించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నాలుగేళ్ల చిన్నారిపై వీరి దాష్టీకం హద్దులు దాటింది. తల్లి, పెంపుడు తండ్రి ఆ చిన్నారిని వైర్‌తో కొట్టి ఆమె శరీరంపై వాతలు పెట్టారు. అంతేకాకుండా, మరింత దారుణంగా ఆమె గోళ్లను పీకి, ఆ గాయాలలో కారం పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. చిన్నారి ముఖం చెంపలపై కూడా వాతలు ఉన్నట్లు గుర్తించారు.
చిన్నారి పడుతున్న దుస్థితిని గమనించిన స్థానికులు వెంటనే ఈ దారుణంపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, పిల్లల వంటిపై పలుచోట్ల గాయాలు, గోళ్లు కత్తిరించిన గుర్తులను చూసి నిర్ఘాంతపోయారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, తల్లి నజ్వీమ్, పెంపుడు తండ్రి జావేద్‌లను అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్రహింసలకు గురైన ఇద్దరు పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) తమ సంరక్షణలోకి తీసుకుంది. కన్నతల్లే ఇంతటి అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.