Fake Notes: దేశంలో మరోసారి నకిలీ నోట్ల భూతం తలెత్తింది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తయారు చేసిన రూ.500 నకిలీ నోట్లు మార్కెట్లోకి చొరబడినట్లు కేంద్ర హోంశాఖ అధికారికంగా హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద నోటు దొరికితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సంబంధిత శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించింది.
ఇటీవల గుర్తించిన నకిలీ రూ.500 నోట్ల ప్రింటింగ్ నాణ్యత అత్యంత ఉన్నతంగా ఉండడంతో, అవి అసలైన నోట్లతో తేడా చెప్పడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. బ్యాంకు అధికారులు, ప్రజలు గమనించాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే — ఈ నకిలీ నోట్లలో చిన్న, కానీ కీలకమైన స్పెల్లింగ్ పొరపాటు ఉంది.
Fake Notes: హోంశాఖ వెల్లడి ప్రకారం, నకిలీ రూ.500 నోట్లపై “RESERVE BANK OF INDIA” అనే పదబంధంలో “RESERVE” అనే పదంలో చివర ‘E’ అక్షరానికి బదులుగా ‘A’ ముద్రించబడినట్లు గుర్తించారు. దీని వల్ల “RESARVE BANK OF INDIA”గా కనిపిస్తుంది. ఈ చిన్న తప్పు ఆధారంగా అసలైనదా? నకిలీదా? అనేది గుర్తించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అయితే దీన్ని గుర్తించాలంటే కంటికి కనపడే స్థాయిలో నోటును జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది.
దర్యాప్తు సంస్థలు అప్రమత్తం
ఈ విషయం సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI), ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU), సీబీఐ, ఎన్ఐఏ తదితర దర్యాప్తు సంస్థలతో పాటు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీతోనూ సమాచారం పంచుకున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. నకిలీ నోట్ల వెనుక అంతర్జాతీయ ముఠాలు ఉండే అవకాశమున్నట్లు భావిస్తున్న అధికారులు, ఉగ్రవాద ఫండింగ్ కోణంలోనూ విచారణ చేపడుతున్నారు.
Also Read: Pope Francis Passes Away: విషాదం.. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత
Fake Notes: ఈ నకిలీ నోట్లు దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఎటిఎంలు, వ్యాపార సంస్థలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. ఇప్పటికే మార్కెట్లో ఈ ఫేక్ నోట్ల సంఖ్య పెద్దగానే ఉందని, ఎన్ని చలామణిలో ఉన్నాయో అంచనా వేయడం కష్టమని అధికారులు పేర్కొన్నారు.
ప్రజలకు హెచ్చరికలు
అనుమానాస్పద నోట్లు దొరికినప్పుడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి
“RESERVE” పదాన్ని గమనించి, “A” ఉంటే అది నకిలీ అని గుర్తించాలి
పెద్ద మొత్తం లావాదేవీలలో నోట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి.