Home Minister Anitha: తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటన రాష్ట్రాన్ని కలవరపరిచింది. బీఈడీ చదువుతున్న ఒక విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమెపై అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణకుమార్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విద్యార్థిని గర్భం దాల్చిన తర్వాత ఆమెను బెదిరించి స్వస్థలానికి పంపించినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.
అంతేకాక, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్‌రెడ్డి విద్యార్థిని వీడియో తీసి వేధించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై ఇన్‌ఛార్జి వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి వెస్ట్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. విచారణలో భాగంగా ఇద్దరు అధ్యాపకుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు సీఐ మురళీమోహన్ తెలిపారు.
Also Read: Indigo: ఇంకా హైదరాబాద్ లో 100కు పైగా విమానాల రద్దు
విద్యార్థులు చెబుతున్న వివరాల ప్రకారం, బాధిత విద్యార్థిని పది రోజుల క్రితమే వీసీ కృష్ణమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దాంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న లక్ష్మణకుమార్‌ను ఈ నెల 1న సస్పెండ్ చేశారని, 2వ తేదీ నుంచి ఆయన విధులకు హాజరు కావట్లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ కేసుపై విచారణ జరిపేందుకు ఐసీసీ కమిటీని కూడా వర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
కేసుపై హోంమంత్రి అనిత స్పందన
తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. కేసు పురోగతిపై ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
హోంమంత్రి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి:
ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. తిరుపతి ఎస్పీ కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. సాక్ష్యాలు సేకరించేందుకు ప్రత్యేక బృందం ఒడిశాకు కూడా వెళ్లింది. బాధిత విద్యార్థినికి న్యాయం చేయడం ప్రభుత్వ ముఖ్య కర్తవ్యమని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలను ఏ విధంగానూ సహించబోమని హెచ్చరించారు. మహిళల రక్షణకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.

