Home Minister Anita: శ్రీకాకుళానికి చెందిన క్యాన్సర్ రోగితో హోం మంత్రి వంగలపూడి అనిత వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న లతశ్రీకి ధైర్యం చెప్పిన మంత్రి, ఆమెకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
హోం మంత్రి అనిత మాట్లాడుతూ, ధైర్యాన్ని మించిన మెడిసిన్ ఏదీ లేదని, మనోధైర్యంతోనే అనేక మంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొని కోలుకుంటున్నారని వివరించారు. లతశ్రీ బాధపడొద్దని, ఆమె పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. కుటుంబ సభ్యులు లతశ్రీకి మద్దతుగా నిలవాలని కోరారు.
ఇది కూడా చదవండి: Trump: ఇరాన్ పై బాంబ్ వేస్తాం.. ట్రంప్ హెచ్చరిక..
ఆ తర్వాత లతశ్రీ పిల్లలతో హోం మంత్రి మాట్లాడి, వారి చదువులు, ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లతశ్రీ హోం మంత్రిని ప్రత్యక్షంగా చూడాలని కోరగా, త్వరలోనే శ్రీకాకుళం వచ్చి కలుస్తానని హోం మంత్రి మాట ఇచ్చారు. ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, సందేహం లేకుండా కాల్ చేయాలని సూచించారు.
హోం మంత్రితో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన లతశ్రీ, తనకు వెయ్యేనుగుల బలం వచ్చినంతగా సంతోషంగా ఉందని చెప్పింది. ఆమె కుటుంబ సభ్యులు కూడా హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బాధితులకు అండగా నిలిచేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు.