FIH Pro League 2024-25: వచ్చే నెలలో భారతదేశంలో జరిగే అంతర్జాతీయ హాకీ సంస్థ (ఎఫ్ఐహెచ్) మహిళల ప్రో లీగ్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి సలీమా టెటె నాయకత్వం వహిస్తుంది. నవ్నీత్ కౌర్ వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. అనుభవజ్ఞుడైన స్ట్రయికర్ వందన కటారియా మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది.
గత ఏడాది జరిగిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీకి గాయం కారణంగా దూరమైన స్టార్ ప్లేయర్ వందన ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్ సాధించి జట్టులో తిరిగి చేరింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల వయస్సున్న వందన 317 మ్యాచ్‌లు ఆడి 158 గోల్స్ చేసింది. ఆమె 2016 రియో ఒలింపిక్స్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రతినిధిగా కూడా పాల్గొంది.
2022 బర్మింగ్‌హామ్ కామన్‌వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్న భారత జట్టులో కూడా వందన భాగమై ఉంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో కాంస్యం, 2018 జకార్తా ఆసియా క్రీడల్లో రజతం, 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన భారత జట్టులో వందన ప్రముఖ పాత్ర పోషించింది. 2021లో ‘అర్జున అవార్డు’ గెలుచుకున్న వందనకు 2022లో ‘పద్మశ్రీ’ పురస్కారం కూడా లభించింది.
ఇది కూడా చదవండి: Ranji Trophy: మ్యాచ్ మధ్యలో విరాట్ అభిమాని.. వెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది
వందనతో పాటు డిఫెండర్లు నిక్కీ ప్రధాన్, జ్యోతి ఛత్రి, బల్జీత్ కౌర్, ముంతాజ్ ఖాన్, రుతుజాకు కూడా జాతీయ జట్టులో స్థానం లభించింది. ఫిబ్రవరి 15 నుండి 25 వరకు భువనేశ్వర్‌లో జరిగే ప్రొ లీగ్‌లో భారత్ తమ మ్యాచ్లను ఫిబ్రవరి 15, 16వ తేదీల్లో ఇంగ్లండ్ తో 18… 19వ తేదీల్లో స్పెయిన్ తో… 21, 22వ తేదీల్లో జర్మనీతో… 24, 25వ తేదీల్లో నెదర్లాండ్స్ తలపడుతుంది.
ఇక ఎఫ్ఐహెచ్ లో తలపడబోయే భారత మహిళల హాకీ జట్టు ఇదే..!
సవిత పూనియా, బిచ్చూ దేవి ఖరిబం (గోల్కీపర్లు), సుశీలా చాను, నిక్కీ ప్రధాన్, ఉదిత, జ్యోతి, ఇషికా చౌదరీ, జ్యోతి ఛత్రి (డిఫెండర్లు). వైష్ణవి విఠల్ ఫాల్కే, నేహా, మనీషా చౌహాన్, సలీమా టెటె (కెప్టెన్), సునెలితా టొప్పో, లాల్రెమ్సియామి, బల్జీత్ కౌర్, షర్మిలా దేవి (మిడ్ ఫీల్డర్లు), నవ్నీత్ కౌర్ (వైస్ కెప్టెన్), ముంతాజ్ ఖాన్, ప్రీతి దూబే, రుతుజా పిసాల్, బ్యూటీ డుంగుంగ్, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా.