Hit And Run

Hit And Run: మాదాపూర్‌లో హిట్ అండ్ రన్: ట్రాఫిక్ హోంగార్డు తీవ్ర గాయాలు

Hit And Run: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌ మాదాపూర్‌లో చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నగరంలోని పర్వత్‌నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోంగార్డును ఒక గుర్తు తెలియని వ్యక్తి తన కారుతో అతివేగంగా ఢీకొట్టి, కనీసం ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడు. మంగళవారం (డిసెంబర్ 30) జరిగిన ఈ ‘హిట్ అండ్ రన్’ ఘటనలో హోంగార్డు నయీం (45) తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన స్థానికులు, తోటి సిబ్బంది స్పందించి క్షతగాత్రుడైన నయీంను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి పరీక్షలు నిర్వహించగా, కారు వేగానికి నయీం కాలు విరిగినట్లు తేలింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని, పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: AP New Districts: ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభం..

ఈ విషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ డీసీపీ సాయి మనోహర్, అడిషనల్ డీసీపీ హనుమంత్ రావు ఆసుపత్రికి చేరుకుని నయీంను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్న అధికారులు, నయీంకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు.

మరోవైపు మాదాపూర్ పోలీసులు ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. హోంగార్డును ఢీకొట్టి పరారైన కారును, దాన్ని నడుపుతున్న వ్యక్తిని గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పర్వత్‌నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి, విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాల మీదకు తెచ్చిన నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *