Dhwajarohan at Ayodhya: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య శ్రీరామ్‌లల్లా దేవస్థానంలో మంగళవారం ఒక చారిత్రాత్మక ఘట్టం జరిగింది. రామమందిర నిర్మాణం పూర్తికి సూచికగా ప్రత్యేక ధ్వజారోహణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా చూసిన ఈ వేడుకలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గర్భగుడి శిఖరంపై కాషాయ ధర్మధ్వజాన్ని ఎగురవేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ధ్వజారోహణకు ముందు ప్రధాని మోదీ రామ్‌లల్లా వద్ద ప్రత్యేక పూజలు చేసి హారతులు సమర్పించారు.
ఈ ధర్మధ్వజం ప్రత్యేకతేంటంటే ఇది 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో, లంబకోణ త్రిభుజాకారంలో తీర్చిదిద్దారు. కాషాయ వర్ణంతో రూపొందిన ఈ జెండాపై సూర్యుడు, కోవిదార చెట్టు, ‘ఓం’ వంటి పవిత్ర చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. రాముడి శౌర్యం, ధర్మం, ఐక్యత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వాల్మీకి రామాయణంలో ప్రస్తావించే కోవిదార చెట్టు చిహ్నం కూడా ఈ జెండాపై కనిపిస్తుంది. అయోధ్య రామరాజ్య ఆదర్శాలను ఈ జెండా ప్రతిబింబిస్తుంది.
Also Read: Bihar: బీహార్ ఎన్నికలపై కాంగ్రెస్ ఎక్స్‌రే.. ఏడుగురు నాయకుల సస్పెన్షన్
ఈ రోజు ప్రత్యేకత కూడా చాలామందిని ఆకట్టుకుంది. సీతారాముల కల్యాణం జరిగిన శుభమైన ‘‘వివాహపంచమి’’ కావడంతో, అదే అభిజిత్ లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం జరగడం విశేషం. ఆధ్యాత్మికతతో కూడిన ఈ ముహూర్తం వేడుకను మరింత పవిత్రంగా మార్చింది.
ఈ జెండాను తయారు చేసిన సంస్థ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న పారాచ్యూట్ మేన్యుఫ్యాక్చరింగ్ యూనిట్. దీర్ఘకాలం నిలిచే పారాచ్యూట్ గ్రేడ్ వస్త్రంతో 25 రోజుల పాటు కష్టపడుతూ ఈ జెండాను తయారు చేశారు. ఇది భారీ గాలులు, వానలను తట్టుకునే విధంగా రూపొందించబడింది.
రామమందిర నిర్మాణం జనవరి 22 ప్రాణప్రతిష్ఠ తర్వాత ఈ ధ్వజారోహణ కార్యక్రమం మరో పవిత్రమైన మైలురాయిగా నిలిచింది. ఉదయం 11:58 గంటలకు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేయడంతో, అయోధ్యలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. సాధువులు, ప్రముఖులు, వేలాది భక్తులు హాజరైన ఈ కార్యక్రమం అయోధ్య సాంస్కృతిక వైభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది. ‘ధ్వజ్ ఆరోహణ్’ అంటూ జరిగిన ఈ వేడుక రామమందిర నిర్మాణ ముగింపుకు గుర్తుగా, జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది.

