Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 396 రహదారులను అధికారులు మూసివేశారు, అందులో రెండు జాతీయ రహదారులు కూడా ఉన్నాయి.
సిమ్లా, లాహౌల్-స్పితి జిల్లాల్లో మేఘవిస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఫలితంగా పలుచోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి, రోడ్లు ధ్వంసమయ్యాయి. సిమ్లాలో బస్టాండ్ కూలిపోవడంతో పాటు పక్కనే ఉన్న దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి. కూట్, క్యావ్ పంచాయతీలకు వెళ్లే మార్గం పూర్తిగా తెగిపోయింది. గాన్వి రేవైన్ ప్రాంతంలో వరదల ధాటికి ఒక పోలీస్ పోస్ట్ కూడా కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: AP High Court: ఏపీ హైకోర్టులోజడ్పీటీసీ ఉప ఎన్నిలక పోలింగ్‌పై విచారణ..
లాహౌల్-స్పితి జిల్లా మయాడ్ లోయలో మేఘవిస్ఫోటనం తాకిడి తీవ్రంగా ఉంది. కర్పాట్, చంగుట్, ఉద్గోస్ నాలా ప్రాంతాల్లో మరో రెండు వంతెనలు ధ్వంసమయ్యాయి. కర్పాట్ గ్రామంలో పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తాజా నివేదిక ప్రకారం, ఎన్‌హెచ్-305 (ఆట్-సైంజ్), ఎన్‌హెచ్-505 (ఖబ్-గ్రామ్‌ఫూ) సహా 325 రోడ్లు మూసివేయబడ్డాయి. వీటిలో మండి జిల్లాలో 179, కులు జిల్లాలో 71 రహదారులు ఉన్నాయి. రోడ్లు, వంతెనలు పునరుద్ధరించడానికి యంత్రాంగం ప్రయత్నాలు వేగవంతం చేసింది.
