Highway Expansion: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనుబంధ కలిగిన కీలక రహదారి అయిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి (ఎన్హెచ్-65) ఆరు లేన్ల విస్తరణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరం నుంచి దండుమల్కాపూర్ సమీపంలోని ఆందోల్ మైసమ్మ ఆలయం వరకు ఆరు లేన్ల విస్తరణ పనులు తొలి దశలో పూర్తయ్యాయి. అక్కడి నుంచి విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి వరకు విస్తరణ పనుల కోసం తాజాగా కదలిక వచ్చింది.
Highway Expansion: ఈ ప్రాజెక్టు కోసం సమగ్ర ప్రాజెక్టు నివేదికను (డీపీఆర్) నవంబర్ రెండోవారంలోగా ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి నాటికి టెండర్ల ప్రక్రియను ముగించి, వెంటనే నిర్మాణ పనులను ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
Highway Expansion: తెలంగాణలో దండుమల్కాపూర్ ఆందోల్ మైసమ్మ ఆలయం నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు మొత్తం 231.32 కిలోమీటర్ల మేర ఈ రహదారిని విస్తరించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.10,391.53 కోట్లుగా ప్రాథమిక అంచనా రూపొందించారు. వీటిలో రోడ్ల నిర్మాణ పనులకు రూ.6,775.47 కోట్లు కాగా, భూసేకరణ, ఇతర అవసరాలకు రూ.3,616.06 కోట్లుగా కేటాయింపులు చేశారు. ఈ మేరకు ఒక్క కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి సగటున రూ.44.92 కోట్లు ఖర్చు చేయనున్నారు.
Highway Expansion: హైదరాబాద్-విజయవాడ ఆరులేన్ల జాతీయ రహదారి విస్తరణ నిర్మాణంలో 33 మేజర్ జంక్షన్లు, 105 మైనర్ జంక్షన్లను నిర్మించనున్నారు. వీటితోపాటు కొత్తగా 4 ఫ్లైఓవర్లు, 17 వెహికిల్ అండర్ పాస్లు నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 94 చోట్ల గెస్ట్ ఏరియాలు, 16 బస్ షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 22.5 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ విధానంలో రహదారిని అభివృద్ధి చేపట్టనున్నారు. ఏపీ పరిధిలో రెండు కొత్త బైపాస్ రోడ్డు నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు.