YS Avinash Reddy: వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈ రోజు ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ పద్ధతిలో కొనసాగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్: పోలింగ్ ప్రారంభానికి ముందే పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పులివెందులలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో పోలీసులు ఆయన ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆయన పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనను అడ్డుకోవడం అమానుషమని, ఇలాంటి పరిస్థితిని తాను ఎప్పుడూ ఊహించలేదని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
నిరసనలు, అరెస్టులు: పోలీసుల హౌస్ అరెస్టును నిరసిస్తూ అవినాష్ రెడ్డి తన ఇంటి ముందు బైఠాయించారు. అనంతరం పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి కడపకు తరలించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, బయటి వ్యక్తులు పులివెందులలో అరాచకాలు సృష్టిస్తుంటే, దాడులను అరికట్టాల్సిన పోలీసులు తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో టీడీపీ, వైసీపీలకు చెందిన పలువురు ఇతర ముఖ్య నేతలను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వారిలో టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, వైసీపీ నేత సతీష్ రెడ్డి ఉన్నారు.
Also Read: Mahaa Vamsi: బెంగళూరు నుంచి పులివెందులకు జగన్, భారతి ఫోన్..
పోలీసుల భారీ భద్రత: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు భారీ బద్రతను ఏర్పాటు చేశారు. కడప డీఐజీ కోయప్రవీణ్, ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో 1,500 మంది పోలీసులు బందోబస్తులో ఉన్నారు. పులివెందులలో మొత్తం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడంతో అక్కడ ప్రత్యేక బలగాలను మోహరించారు. జిల్లా సరిహద్దులతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. డబ్బు, మద్యం వంటివి తరలించకుండా నిఘా పెట్టారు.
అభ్యర్థులు, ఓటర్ల వివరాలు: పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉంది. మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ 10,601 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి సహా మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ 24,606 మంది ఓటర్లు ఉన్నారు. రెండు చోట్లా పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.