Gudivada: కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీ కార్యక్రమాలతో పాటు ఫ్లెక్సీ వార్‌కు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేస్తున్నారు.
వైసీపీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా “బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ” అంటూ వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి ధీటుగా టీడీపీ కార్యకర్తలు మాజీ మంత్రి కొడాలి నాని గతంలో చేసిన సవాల్‌ను గుర్తుచేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. “కుప్పంలో చంద్రబాబు గెలవరని కొడాలి నాని చేసిన సవాల్‌ను గుర్తుచేస్తూ, ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి” అంటూ టీడీపీ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి.
నాగవరప్పాడు సెంటర్‌కు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు, వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న జెడ్పీ చైర్‌పర్సన్ హారిక కారును అడ్డుకున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి కారుపైకి రాయి విసిరి అద్దం పగలగొట్టాడు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్న టీడీపీ-జనసేన శ్రేణులు, ఆ వాహనానికి టీడీపీ జెండాను తగిలించారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కూడా కే కన్వెన్షన్ వైపునకు దూసుకొచ్చారు.
పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. నాగవరప్పాడు జంక్షన్ నుండి కే కన్వెన్షన్ సెంటర్ వైపు వైసీపీ కార్యకర్తలు వెళ్లకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని సహా ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కే కన్వెన్షన్ వద్ద వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుండగా, బయట తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది.
మరోవైపు, నాగవరప్పాడులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మొత్తానికి గుడివాడ ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా మారింది, ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని స్థానికులతో పాటు పోలీసులు కూడా టెన్షన్ లో ఉన్నారు.