High Court:నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఎవరో చేసిన తప్పునకు తనను బలి చేయొద్దని వేడుకుంటూ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి హైకోర్టును ఆశ్రయించింది. సరైన విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకొని తనకు పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె హైకోర్టును కోరింది.
High Court:నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రంలోని 8వ నంబర్ గది నుంచి తెలుగు ప్రశ్నపత్రం లీకైనట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి, కొందరిని అదుపులోకి తీసుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజీపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తోపాటు డిపార్ట్‌మెంటల్ అధికారిని విధుల నుంచి తొలగించగా, విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు.
High Court:ఈ పేపర్ లీకేజీకి విద్యార్థిని కారణమంటూ విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని డిబార్ చేశారు. తను పరీక్ష రాస్తుండగా, పేపర్ ఇవ్వకపోతే రాయితో కొడతానంటూ ఒకతను బెదిరిస్తేనే తాను పేపర్ ఇచ్చానని విద్యార్థిని ఝాన్సీలక్ష్మి చెప్తున్నది. ఈ దశలో అధికారులు, ఆకతాయిల తప్పిదానికి తనను బలి చేశారంటూ విద్యార్థిని ఝాన్సీలక్ష్మి హైకోర్టుకు అందజేసిన పిటిషన్‌లో పేర్కొన్నది.
High Court:తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గురువారం విద్యార్థిని ఝాన్సీలక్ష్మి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిలో విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరీ, నల్లగొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్‌ను విద్యార్థిని ఝాన్సీలక్ష్మి ప్రతివాదులుగా పేర్కొన్నది. విద్యార్థిని ఝాన్సీలక్ష్మి పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు.. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది.