High Court: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటన కేసుపై తెలంగాణ హైకోర్టు మంగళవారం (ఏప్రిల్ 8) సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులోని ఐదుగురు నిందితులకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. 2016లోనే ఇచ్చిన కింది కోర్టు తీర్పును సమర్థిస్తూ ఈ రోజు తుది తీర్పును ఇచ్చింది. దీంతో 12 సంవత్సరాల నాటి ఘటనలో నిందితులకు శిక్ష పడింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా, 131 మంది గాయాలపాలయ్యారు.
High Court: 2013 ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్ వరస బాంబు పేలుళ్ల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజలంతా ఉలికిపాటుకు గురయ్యారు. దిల్‌సుఖ్‌నగర్ సిటీ బస్టాప్‌లో, కోణార్క్ థియేటర్ ఎదుట ఓ మిర్చి బండి వద్ద వరుసగా పేలిన బాంబులతో ఆ ప్రాంతంలో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు మృతుల శరీరభాగాలు తునాతునకలయ్యాయి. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో గాయాలపాలైన ఓ మహిళ గర్భంలోని శిశువుకూ గాయలవడం బాధాకరం.
High Court: ఇండియన్ ముజాయిదీన్ ఉగ్రవాద సంస్థ ఈ దిల్‌సుఖ్‌నగర్ వరస బాంబు పేలుళ్లకు పాల్పడింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇండియన్ ముజాయిదీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్‌ను గుర్తించారు. భత్కల్ పరారీలో ఉన్నాడని ఎన్ఐఏ నిర్ధారించింది. అతనితోపాటు ప్రధాన నిందితులైన అసదుల్లా అక్తర్, జియావుర్ రెహమాన్, ఎజాజ్ షేక్, తహసిన్ భత్కల్‌కు ఉరిశిక్షను ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
High Court: దిల్‌సుఖ్‌నగర్ వరస బాంబు పేలుళ్ల కేసును ప్రత్యేకంగా విచారించిన ఎన్ఐఏ కోర్టు 2016లోనే నిందితులకు ఉరిశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తర్వాత నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పును వెలువరించింది. నిందితుల అప్పీలును కొట్టివేస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.