High court: రాజకీయ నాయకులు పార్టీలు మారడం సర్వసాధారణం. కొందరు స్వలాభం కోసం, మరికొందరు కేసుల నుంచి తప్పించుకోవడానికి లేదా ఇతర కారణాలతో పార్టీలు మారుతుంటారు. అయితే, ఇటువంటి పార్టీ మార్పులపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పార్టీ మారాలనుకునే ప్రజా ప్రతినిధులు ముందుగా తమ పదవికి రాజీనామా చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. రాజీనామా చేసిన తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రావాలని పేర్కొంది. ఇదే నిజమైన ప్రజాస్వామ్యానికి అర్థం అని హైకోర్టు అభిప్రాయపడింది.
ప్రజల మద్దతుతో ఒక పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత మరో పార్టీలో చేరినా పదవికి రాజీనామా చేయకపోవడం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానించడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలు ఓటు వేసే సమయంలో అభ్యర్థికి మద్దతు ఇచ్చేది పార్టీ విధానాలను, అభ్యర్థి నడవడికను బట్టి. కానీ గెలిచిన తర్వాత పార్టీ మారితే, అది ప్రజల తీర్పును తక్కువ చేసి చూడటమే అవుతుందని కోర్టు తెలిపింది.
పార్టీ ఫిరాయింపుదారులను గెలిపించాలా? ఓడించాలా? అన్నది ప్రజలకే తెలిసిన వ్యవహారమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం ఉండాలంటే ఇలాంటి మార్పులు నియంత్రించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
