Telangana High Court

Telangana High Court: సిగాచీ పేలుడు కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court: సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోరమైన పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదం చాలా చిన్నది కాదని, ఏకంగా 54 మంది అమాయక కార్మికులు చనిపోయారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ గుర్తు చేశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగి చాలా కాలం అవుతున్నా, దర్యాప్తు మాత్రం ఇంకా కొనసాగుతోందని పోలీసులు చెప్పడంపై సీజే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 237 మంది సాక్షులను విచారించినా కూడా దర్యాప్తులో ఎందుకు పురోగతి లేదని, పేలుడుకు బాధ్యులైన వారిని ఇంతవరకు ఎందుకు గుర్తించలేకపోయారని న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఈ తరహా పెద్ద కేసులకు సాధారణంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కదా అని హైకోర్టు అభిప్రాయపడింది. కేవలం డీఎస్పీ స్థాయి అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించడంపైనా న్యాయమూర్తి అభ్యంతరం తెలిపారు. ఈ ప్రమాదంపై దాఖలైన పిల్‌ విచారణ సందర్భంగా సీజే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసుల దర్యాప్తు తీరుపై పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఏఏజీని ఆదేశించింది. అంతేకాకుండా, తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి తప్పకుండా కోర్టు ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *