Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టుకు హాజరైనప్పుడు ఆయన డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేదని, ప్రజలకు ఎలా సేవ చేస్తారని ప్రశ్నించింది. అంతేకాకుండా, ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఆగ్రహం
మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితురాలు వనబట్ల కవితకు నష్ట పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను పాటించకపోవడం, పైగా ఆర్డీవో, ఎమ్మార్వోలకు చెప్పి కవితపై అక్రమ కేసులు పెట్టించినందుకు కలెక్టర్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బాధితురాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా?
గతంలో ఇదే కేసులో కోర్టుకు హాజరైనప్పుడు కూడా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా డ్రెస్సింగ్ సెన్స్ సరిగా లేదని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. “కోర్టు ప్రొసీడింగ్స్ తెలియదా? కోర్టుకు వచ్చే పద్ధతి ఇదేనా?” అంటూ తీవ్రంగా మండిపడింది.
కలెక్టర్‌పై చర్యలకు ఆదేశం
ఈ కేసు విచారణలో భాగంగా, కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు, బాధితురాలిపై అక్రమ కేసులు నమోదు చేయించినందుకు కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రిన్సిపల్ హోమ్ సెక్రటరీని ఆదేశించింది. అంతేకాకుండా, గతంలో బాధితురాలికి ఇచ్చిన నష్టపరిహారం తీర్పును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి, సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పు ప్రభుత్వ అధికారులకు ఒక గట్టి హెచ్చరిక అని న్యాయ నిపుణులు అంటున్నారు.