High court: విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు ఉంచకుండా వెంటనే తొలగించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కేబుల్ తొలగింపు అంశంపై ఎయిర్‌టెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటాన్ని సహించలేం. చలనరహిత చట్టాలతో ప్రాణాలను ఎలా కాపాడతాం?” అని ప్రశ్నించారు.
రామంతాపూర్ ఘటన ప్రస్తావన
ఇటీవల రామంతాపూర్‌లో శ్రీకృష్ణామి వేడుకల్లో ఊరేగింపు రథానికి కేబుల్ వైర్ ద్వారా విద్యుత్ సరఫరా కావడంతో ఐదుగురు దుర్మరణం పాలైన ఘటనను జడ్జి ప్రస్తావించారు.
“తన పుట్టినరోజున కేక్ కోయాల్సిన 9 ఏళ్ల బాలుడు తండ్రికి తలకొరివి పెట్టడం కలచివేసింది. పసి హృదయం పగిలిపోయింది. అందరం బాధ్యులమే. సమాజం సిగ్గుతో తలదించుకోవాలి” అని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఆదేశాలు – ఎయిర్‌టెల్ పిటిషన్
రామంతాపూర్ ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎయిర్‌టెల్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై నేడు మరోసారి విచారణ జరగ్గా, హైకోర్టు ప్రాణ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేలా వ్యాఖ్యలు చేసింది.