CM Siddaramaiah

CM Siddaramaiah: హైకమాండ్ షాక్: సిద్ధరామయ్యకు అపాయింట్‌మెంట్ నిరాకరణ!

CM Siddaramaiah: కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి పదవి (సీఎం కుర్చీ) విషయంలో మరోసారి తీవ్ర స్థాయిలో సంక్షోభం నెలకొంది. సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు తారాస్థాయికి చేరుకుంది. నవంబర్ నెలాఖరులో రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పులు వస్తాయనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఢిల్లీ చుట్టూ నాయకుల చక్కర్లు
రాష్ట్రంలో ఈ మార్పులు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో, సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తరచూ బెంగళూరు, ఢిల్లీ మధ్య పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యంగా, డీకే శివకుమార్ వారం రోజుల్లోనే రెండుసార్లు ఢిల్లీ వెళ్లడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. ఆయన ‘ఓట్ చోరీ’ కేసుకు సంబంధించి ఢిల్లీకి వెళ్లినప్పటికీ, రాజకీయ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం.

సిద్ధరామయ్యకు అపాయింట్‌మెంట్ నిరాకరణ?
ఈ పరిణామాల మధ్య సీఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ షాక్ ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సిద్ధరామయ్య ఒక పుస్తక విడుదల కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆ సమయంలో పార్టీ సీనియర్ నాయకులను కలిసేందుకు ఆయన సమయం కోరగా, ప్రస్తుతం ఆ సమావేశం అవసరం లేదని అధిష్ఠానం నిరాకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు, కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం నవంబర్ 15 వరకు కర్ణాటక నేతలెవరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చేది లేదని స్పష్టం చేసిందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: Harish Rao: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డబ్బు, మద్యం పంచుతోంది!

బల ప్రదర్శన రాజకీయాలు
అధిష్ఠానం సమయం ఇవ్వకపోయినా, సిద్ధరామయ్య వర్గం మాత్రం తమ బలం ప్రదర్శిస్తోంది. సిద్ధరామయ్యకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాల్, తన సోదరుడు ఎంపీ రాజశేఖర హిట్నాల్ నివాసంలో ఢిల్లీలో ఎమ్మెల్యేలు, మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. ఇది అంతర్గతంగా సిద్ధూ వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారో చూపించడానికి చేసిన బల ప్రదర్శనగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అయితే, ఈ రాజకీయ అనిశ్చితిపై సిద్ధరామయ్య మాత్రం విశ్వాసం వ్యక్తం చేశారు. “మరో రెండున్నరేళ్లు కూడా మన పార్టీనే అధికారంలో ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారనే నమ్మకం నాకు ఉంది” అని కార్యకర్తలతో అన్నారు.

డీకే శివకుమార్ ఎత్తుగడ
ముందుగా ఇచ్చిన హామీ ప్రకారం ఏ క్షణంలోనైనా సీఎం పదవి తనకు దక్కుతుందని డీకే శివకుమార్ గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తికావస్తుండటంతో, మంత్రివర్గ విస్తరణ లేదా మార్పులు-చేర్పులు తప్పవని భావిస్తున్నారు. తొలిసారి కేబినెట్ కూర్పులో సిద్ధరామయ్యకు మద్దతిచ్చిన వారికే ఎక్కువ పదవులు దక్కాయి. ఈసారి కూర్పులో తనకు అనుకూలంగా ఉన్న నాయకులకు పెద్దపీట వేయాలని డీకే శివకుమార్ పావులు కదుపుతున్నారు.

రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లే ముందుగానే మంత్రివర్గ జాబితాను హైకమాండ్‌కు పంపించాలని డీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠ నవంబర్ చివరి నాటికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *