Muslim hates Terrorism: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కశ్మీర్‌ను కుదిపేసింది. బైసరాన్ వ్యాలీలో 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీసిన ఈ ఘోర ఘటనలో స్థానిక ముస్లిం యువకుడు సజాద్ అహ్మద్ భట్ చూపిన మానవత్వం అందరి హృదయాలను కదిలించింది. స్థానికంగా చిరు వ్యాపారం చేసుకునే సజాద్, గాయపడిన ఓ పర్యాటకుడిని తన భుజాలపై ఎత్తుకుని… ఆస్పత్రికి తరలించిన వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. లష్కర్-ఎ-తొయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ సృష్టించిన ఈ నరమేధానికి.. మతానికి ముడిపెడుతూ… కొందరు వాదిస్తుండటం భయంగొల్పుతోంది. ఇటువంటి సమయంలో ఈ ముస్లిం యువకుడి మాటలు వింటే మాత్రం.. భారత్‌లో మత సామరస్యం పునాదులు ఎంత బలమైనవో అర్థమవుతుంది.
కశ్మీరి స్థానిక యువకుడు సజాద్ అహ్మద్ భట్. పహల్గాం మారణహోమానికి ప్రత్యక్ష సాక్షి మాత్రమే కాదు. మతం కన్నా మానవత్వం ముఖ్యమని చాటిన అసలైన కశ్మీరి. అతని మాటలు వింటే.. అసలైన కశ్మీరీలు మతంతో సంబంధం లేకుండా ఉగ్రవాదంపై ఎంత విసుగు చెంది ఉన్నారో స్పష్టమవుతుంది. స్థానిక మీడియా ప్రతినిధి అతని మందు మైక్ పెట్టి ప్రశ్నించగానే.. ఉగ్రవాదులపై ఒంటికాలిపై లేస్తూ… “ఈ దుర్మార్గులు ఇక్కడ మా మానాన మమ్మల్ని బతకనివ్వట్లేదు. అడుగడుగునా మమ్మల్ని చంపుకుతింటున్నారు. ఇక్కడికొచ్చే టూరిస్టులే మాకు దేవుళ్లు. వారి రాక మాకు జీవనాధారం. మేం రెండు పూటలా తినాలి. మా పిల్లలు చదువుకోవాలి.
Also Read: Pak Terrorism vs India: కొంపకు నిప్పు ఆర్పుకోక భారత్‌పై పాక్ కుట్రలు
Muslim hates Terrorism: శాంతితో జీవించాలి. ఇప్పటికే మేం పూర్తిగా కుంగిపోయాం. ఈ దుర్మార్గులకు కఠిన శిక్షలు పడాలి” అంటూ వాపోయాడు సజాద్ అహ్మద్. మొత్తం సంఘటనను వివరిస్తూ… “ఏప్రిల్ 22న బైసరాన్ వ్యాలీలో కాల్పుల శబ్దం వినిపించగానే, పహల్గాం పోనీ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ వహీద్ వాన్ వాట్సాప్ గ్రూప్‌లో సమాచారం ఇవ్వడంతో కొంత మంది స్థానికులం కలిసి సంఘటనా స్థలానికి వెళ్లాం. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అక్కడికి చేరుకోగానే… గాయపడిన పర్యాటకులకు నీళ్లిచ్చాం. నడవలేని స్థితిలో ఉన్న వారిని భుజాలపై ఎత్తుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాం. పర్యాటకులు ఏడుస్తుంటే మాకూ కన్నీళ్లు ఆగలేదు. వారు రాకుంటే మా ఇళ్లలో దీపాలు వెలగవు. మా జీవితం అసంపూర్ణం” అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు సజాద్ అహ్మద్. స్థానికులెవరూ ఈ దాడిలో భాగం కాదని, ఈ ఘటన వారి జీవనోపాధిని దెబ్బతీసిందని వాపోయాడు పహల్గాం పోనీ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ వహీద్ వాన్.
‘మినీ స్విట్జర్లాండ్’గా పిలిచే బైసరాన్ వ్యాలీ ఈ దాడితో రక్తసిక్తమైంది. సజాద్, వాన్‌లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పర్యాటకులను కాపాడారు. మతం కన్నా మానవత్వమే ముఖ్యం.. మాకు జీవనోపాధి కల్పిస్తున్న పర్యాటకులు ఆపదలో ఉంటే.. సాయం చేయడమే మా ముందున్న కర్తవ్యం అంటూ ఇద్దరూ ఒకే మాటగా చెప్పారు. ఈ ఘటన కశ్మీరీల మానవత్వాన్ని, పర్యాటకుల పట్ల వారి అభిమానాన్ని చాటింది.