Sai Pallavi: శివ కార్తీకేయన్ హీరోగా, సాయిపల్లవి హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా ‘అమరన్’. ఈ సినిమా ఆడియో లాంచ్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నయ్ లో జరిగింది. ఈ వేడుకకు లోకేష్ కనకరాజ్, మణిరత్నం గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో శివకార్తికేయన్ ఆసక్తికరమైన కొన్ని అంశాలను ఆహుతులకు తెలియచేశారు. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ చూసినప్పుడు అందులో మలర్ టీచర్ గా నటించిన సాయిపల్లవి యాక్టింగ్ కు తాను ఫిదా అయిపోయానని చెప్పారు. అదే విషయాన్ని ఆమెకు ఫోన్ ద్వారా తెలియచేశానని, ‘అన్నా… ధ్యాంక్యూ అన్నా ‘ అని బదులిచ్చిందని, అలానే క్లయిమాక్స్ బాగా చేశావని పొగిడినప్పుడూ తనను అన్నా… అన్నా అంటూ సంభోదించడం కాస్తంత మనసుకు బాధను కలిగించిందని శివకార్తికేయన్ నవ్వుతూ చెప్పాడు. రాబోయే రోజుల్లో మనిద్దరం కలిసి సినిమా చేద్దామని, సాయిపల్లవితో తాను అప్పుడే చెప్పానని… ఆ మాట ఇంతకాలానికీ నిజమైందని శివ కార్తికేయన్ అన్నాడు. వీరిద్దరూ జంటగా నటించిన ‘అమరన్’ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న విడుదల కాబోతోంది.
