Traffic Jam

Traffic Jam: లారీ బోల్తా.. విజయవాడ హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

Traffic Jam: సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణికులకు హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవేపై తీవ్ర అంతరాయం కలిగింది. మంగళవారం ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలోని ఇనాంగూడ వద్ద కర్రల లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడమే కాకుండా, అందులోని కర్రలన్నీ హైవేపై చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనివల్ల ఇనాంగూడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సహాయక చర్యల్లో పోలీసులు

ప్రమాద విషయం తెలియగానే అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై పడిపోయిన కర్రలను తొలగించేందుకు మూడు జేసీబీలు, రెండు క్రేన్లను రంగంలోకి దించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి, రోడ్డును క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లారీ బోల్తా పడటంతో పండుగకు వెళ్లే కార్లు, బస్సులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి.

ఇది కూడా చదవండి: Alyssa Healy Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా కెప్టెన్

టోల్ ప్లాజాల వద్ద పెరుగుతున్న రద్దీ

ఒకవైపు ప్రమాదం వల్ల ట్రాఫిక్ నిలిచిపోగా, మరోవైపు పండుగ రద్దీతో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద కార్ల రద్దీ విపరీతంగా పెరిగింది. విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేకంగా 10 టోల్ బూత్‌లను అందుబాటులోకి తెచ్చారు. అయినప్పటికీ వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.

జాగ్రత్తగా వెళ్లాలని సూచన

పెదకాపర్తి, చిట్యాల, కోదాడ మరియు రామాపురం క్రాస్ రోడ్ల వద్ద కూడా వాహనాల రాకపోకలు మందకొడిగా సాగుతున్నాయి. హైవేపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో (బ్లాక్ స్పాట్స్) పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచారు. ప్రయాణికులు వేగంగా వెళ్లకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని అధికారులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *