Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తెల్లవారుజామున అకాలంగా కురిసిన భారీ వర్షం నగరాన్ని అల్లకల్లోలం చేసింది. వేసవి ఉక్కపోతలో ఉన్న ప్రజలకు వర్షం కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, ప్రజా రవాణా, విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం చూపింది. ద్వారకలో ఇంటిపై కూలిన చెట్టు నలుగురు మృతి చెందగా, మరొకరికి గాయాలు. మృతుల్లో మహిళ, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఉదయం నుంచి ఢిల్లీలో భారీ వర్షాలు, 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు.
కుండపోత వర్షంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. ముఖ్యంగా లజ్‌పత్‌నగర్, ఆర్కే పురం, ద్వారక, జంగ్‌పురా వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించిపోయింది. స్కూల్ బస్సులు, క్యాబ్‌లు, ప్రజా రవాణా వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే నత్తనడకన సాగాయి.
వర్షంతో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు భారీ ఆటంకం ఏర్పడింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, 40కి పైగా విమానాలు ఇతర నగరాలకు మళ్లించబడ్డాయి. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. అధికారుల సమాచారం మేరకు, ప్రయాణికుల సేవల కోసం అదనపు సిబ్బందిని మోహరించారు.
వాతావరణ శాఖ తాజా నివేదిక ప్రకారం, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు 80 కి.మీ వేగంతో వీస్తుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాల్లో మళ్లీ నీరు నిలిచే ప్రమాదం ఉందని అధికారులు పేర్కొన్నారు.
Delhi: అటు హరియాణా రాష్ట్రం కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఝజ్జర్ జిల్లాలో తీవ్రమైన వర్షంతో రహదారులు నదుల్లా మారాయి. జనజీవనం గందరగోళానికి లోనైంది.
ప్రభుత్వ సూచనలు:
ప్రయాణికులు తమ విమానాల తాజా సమాచారం కోసం వెబ్‌సైట్లు, యాప్‌లు చెక్ చేయాలి.
అవసరం లేని వరకు ఇంట్లోనే ఉండాలి.
వర్షం తీవ్రత తగ్గే వరకు బయట ప్రయాణాలు నివారించాలి.
వర్షాలు వేసవికి శాంతి తెచ్చినా, నగర పాలకులు ముందస్తుగా తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.