Heavy Rains

Heavy Rains: తీవ్ర అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు

Heavy Rains: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో రహదారులన్నీ పూర్తిగా జలమయమై, వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ప్రజల జీవనం తీవ్రంగా స్తంభించింది.

అత్యధిక వర్షపాతం మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు అత్యధికంగా తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పదికి పైగా ప్రాంతాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెం.మీ. వర్షం పడింది.

ఏపీలో జనజీవనం స్తంభన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తిరుపతి, కోనసీమ, వైఎస్సార్‌ కడప వంటి జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూర్తిగా తడిసి ముద్దయింది. శేషాచలం కొండల నుంచి వరదలు పోటెత్తడంతో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తిరుమలలో కూడా ఎడతెరిపిలేని వర్షం కురిసి భక్తులను ఇబ్బందులకు గురిచేసింది. ఘాట్‌రోడ్డులోని జలపాతాలు పొంగి ప్రవహిస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోని చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కడప నగరంలో రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు చేరి జనజీవనం ఆగిపోయింది. నెల్లూరు జిల్లాలో మిడతవాగు, ఉప్పుటేరు, కొమ్మలేరు వంటి వాగులు ఉధృతంగా పారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నీటమునిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా 2,296 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు తెలిపారు. చెన్నై– విజయవాడ జాతీయ రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Also Read: DSP Jayasuriya issue: జనసేన పుట్టలో వేలు పెడుతున్న రఘురామ!

తమిళనాడులో మృతులు, భారీ నష్టం పొరుగున ఉన్న తమిళనాడులో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నై సహా 12 జిల్లాల్లో బుధవారం పాఠశాలలకు సెలవు ప్రకటించారు. తంజావూరు, తిరువారూరు, నాగపట్టిణం జిల్లాల్లో 1.30 లక్షల ఎకరాలకుపైగా పంట నీట మునిగింది. కడలూరు జిల్లాలోని ఆండార్‌ ముళ్లిపాళ్యంలో ఇల్లు కూలి తల్లీకుమార్తెలు మరణించారు. పుదుచ్చేరిలో గత 24 గంటల్లో అత్యధికంగా 25 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

మరికొన్ని రోజులు హెచ్చరికలు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకారం, ఈ అల్పపీడనం క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ గురువారం నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు పయనించే అవకాశం ఉంది. ఇది వాయుగుండంగా బలపడేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా.

పోర్టులకు హెచ్చరికలు: మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ, అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని అప్రమత్తం చేశారు. అరేబియా సముద్రంలోనూ వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో ఐఎండీ దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *